HbA1C పరీక్ష దక్షిణ ఆసియా లో వారందరికీ గుండె జబ్బు నివారణలో ఎందుకు విలువైనది ? 19.
దక్షిణ ఆసియా దేశాలలో భారత దేశమూ, నేపాలు , పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన దేశాలున్నాయి. ఇటీవలి పరిశోధనల వల్ల ఈ దేశ వాసులందరిలో , డయాబెటిస్ వచ్చే రిస్కు పలు కారణాల వల్ల ఎక్కువ గా ఉంటుందని తెలిసింది. ఈ రిస్కు , వారు , వారి దేశం వదిలి వెళ్లి , వేరే ఏ ఇతర దేశం లో స్థిర పడ్డా కూడా మారదని కూడా వివిధ పరిశీలనల వల్ల విశదమయింది. ( మనం డయాబెటిస్ లేక మధుమేహ వ్యాధి గురించి ముందు ముందు టపాలలో వివరం గా తెలుసుకుందాము ).
ఇప్పుడు HbA1C పరీక్షకూ , గుండె జబ్బులకూ సంబంధం ఏమిటి ? :
మనం గుండె జబ్బు నివారణ ఎట్లా చేయ వచ్చో తెలుసుకుంటున్నాము కదా ! డయాబెటిస్ అంటే మధుమేహాన్ని అత్యంత తొలి దశలలో కనుక్కోవడానికి HbA1C test అంటే హెచ్ బీ ఎ వన్ సి పరీక్ష అత్యంత ఉపయోగకరమైనది. మనం ఇప్పటి వరకూ మధుమేహాన్ని కనుక్కోవడానికి మన రక్తం లో ఉన్న చెక్కెర పరిమాణాన్ని కొలిచి నిర్దారించడం జరుగుతూ ఉన్నది. కానీ ఇటీవల HbA1C test ను మధుమేహాన్ని నిర్ధారించే ప్రధాన పరీక్ష గా ప్రపంచం అంతా ఆమోదించడం జరిగింది.
ఈ పరీక్ష వివరాలు చూడండి.
మన రక్తం లో సహజం గా ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా ! ఈ ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ ఉంటుంది
కదా ! ఈ హీమోగ్లోబిన్ సహజం గా ఆక్సిజెన్ ను ఆకర్షించి మన శరీరం లో ప్రతి భాగాన్నీ చేరవేస్తుంది.
కానీ ఇటీవల శాస్త్రజ్ఞులు మన రక్తం లో ఉన్న గ్లూకోజు కూడా ఈ హీమోగ్లోబిన్ చేత ఆకర్షింప బడుతుంది. అప్పుడు దానిని గ్లయికోజిలేతేడ్ హీమోగ్లోబిన్ అంటారు ( glycosilated hemoglobin or HbA1C ). కొన్ని ప్రత్యెక పద్ధతుల ద్వారా ఈ గ్లయికోజిలేటేడ్ హీమోగ్లోబిన్ పరిమాణం కొలిచి, నార్మల్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటె అప్పుడు మధుమేహాన్ని లేక డయాబెటిస్ ను నిర్దారించుతారు.

పై చిత్రం చూడండి. వివరణ : మొదటి చిత్రం లో రక్తనాళం ను కోసినట్టు చూపించారు. అందులో సహజం గా ఉండే గ్లూకోజు అణువులు రక్త కణాలకు ఎక్కువ గా అతుక్కోవు. కానీ మన రక్తం లో అవే గ్లూకోజు అణువులు ఎక్కువ అయినప్పుడు , రక్త కణాలకు ఎట్లా అతుకు కుంటాయో కూడా చక్క గా చూపబడింది.
మధుమేహాన్ని ముందుగా కనుక్కోక పొతే , కంట్రోలు లో లేని మధుమేహం గుండెజబ్బులకు అత్యధిక రిస్కు అవుతుంది. అందువల్ల ఈ HbA1C పరీక్ష అత్యంత విలువైనది, ఉపయోగ కరమైనది కూడా !
ఎవరు చేయించుకోవాలి ఈ పరీక్షను ? :
కుటుంబం లో మధుమేహం ఉంటె, లేక అత్యధిక బరువు ఉంటె, ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే సహజం గా కుటుంబం లో ఎవరికైనా మధుమేహం ఉంటె , ఆ జన్యువులు లేక జీన్స్ మనలో కూడా ఉండి, మధుమేహం కలిగించడానికి అవకాశం హెచ్చుతుంది. అలాగే ఉండవలసిన బరువు కన్నా ఎక్కువ ఉన్నవారికి మధుమేహం రావడానికి అవకాశం హెచ్చు. అందువల్ల ఈ పరీక్ష చాలా ప్రయోజనకారి.

పై చిత్రం లో ఎన్ని మిల్లీగ్రాముల గ్లూకోజుకు ఎంత HbA1C ఉందొ చాలా అర్ధ వంతం గా రంగులతో చూపబడింది.
ఇక్కడ సాధారణ లెవెల్స్ ఆకు పచ్చ రంగులోనూ , ప్రమాదకర లెవెల్స్ ఎరుపు రంగులోనూ చూపబడ్డాయి. ప్రమాద కరం అంటే రక్తం లో ఒక లెవెల్ లో ఉండవలసిన పరిమాణం కన్నా ఎక్కువ గ్లూకోజు ఉంటె ఆ పరిస్థితి పరిణామాలు తీవ్రం గా ఉంటాయి.
వచ్చే టపాలో ఇంకో పరీక్ష గురించి తెలుసుకుందాము !