గుండె జబ్బు నివారణ కు కొలెస్టరాల్ రక్త పరీక్ష ఎందుకు?.16.
నెయ్యి నూనెలన్ని, ఒక్క పోలికనుండు ,
చూడ చూడ రుచుల జాడ వేరు,
కొవ్వులందు ‘ మంచి కొవ్వులు ‘ వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ !
( కీ.శే. వేమన గారికి కృతజ్ఞతలతో ! )
మనం ఇంత వరకూ గుండె జబ్బులకు రిస్కు ఫ్యాక్టర్లు ఏమిటి ? ఇంకా ACS గురించీ కొంత వరకు తెలుసుకున్నాము కదా ! ప్రత్యేకించి , కొలెస్టరాల్ అంటే చెడు కొలెస్టరాల్ , అంటే LDL కొలెస్టరాల్ ఎట్లా మన రక్త నాళాలకు అతుక్కొని ప్లేక్ ఫార్మేషన్ కు కారకమవుతుందో కూడా చూశాము కదా !
ఇప్పుడు కొలెస్టరాల్ పరీక్షల గురించి తెలుసుకుందాము.
అసలు ఈ కొలెస్టరాల్ పరీక్షలు ముందుగా ఎందుకు చేయించుకోవాలి?:
మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది కదా సమాధానం. మనకు చెడు కొలెస్టరాల్, ( LDL Cholesterol ) మన రక్త నాళాలకు ఒక పూత లాగా అటుక్కుంటుంది. ఇలా అతుక్కోవడం ఒక రోజులో జరగదు. కొన్నిసంవత్సరాలు జరిగి, ప్లేక్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ కొలెస్టరాల్ మన రక్తం లో ఎంత ఎక్కువ గా ఉంటే, అంత త్వరితం గా ప్లేక్ ఫార్మేషన్ కు ఆస్కారం ఉంది. అందువల్ల మనం ముందే మన రక్తం లో ఉండే చెడు కొలెస్టరాల్ ఎంత ఉందొ కనుక్కుంటే , తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు, గుండె జబ్బును దశాబ్దాలకు పైగా వాయిదా వేయవచ్చు కదా !
ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫయిల్ అంటే ఏమిటి ?: ( Fasting Lipid Profile ) :
అంటే మనం ఒకరోజు రాత్రి భోజనం తరువాత ఏమీ తినకుండా, పర కడుపుతో అంటే ఖాళీ కడుపుతో , ఉదయం లిపిడ్ అంటే కొవ్వు అంటే మన రక్తం లో కొవ్వు శాతం ఎంత ఉందీ, అందులో HDL , లేక LDL కొవ్వు ఎంత శాతం ఉందీ అనే పరీక్షలు చేస్తారు. కనీసం తొమ్మిది నుంచి పన్నెండు గంటలు మనం ఏమీ తినకుండా ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే మనం సహజం గా ఏమైనా తింటే మన రక్తం లో కొలెస్టరాల్ ఎలాగూ ఎక్కువ అవుతుంది. అందువల్ల తప్పు ఫలితాలు ( errors in results ) వస్తాయి.
HDL ( High Density Lipoproteins ) గురించి మనకు ఏమి తెలుసు ?:
కొలెస్టరాల్ మన రక్తం లో మూడు రూపాలలో ఉంటుంది. ఒకటి ట్రై గ్లిజారైడ్స్ ( Tri glycerides ), రెండు హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ ( HDL or High density Lipoproteins ) మూడు: లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్
( LDL or Low Density Lipo Proteins ) అని.( పై చిత్రం లో ఈ వివరణ చిత్ర రూపం లో గమనించండి ) సాధారణం గా లిపిడ్ ప్రొఫయిల్ టెస్ట్ లో ఈ మూడూ ఎంత ఉన్నాయనే విషయం మనకు తెలుస్తుంది.
HDL కొలెస్టరాల్ మనకు అవసరం. ఇది మంచి కలిగించే గుడ్ కొలెస్టరాల్ ( good cholesterol ) అన బడుతుంది,. ఎందుకంటే , ఈ మంచి కొలెస్టరాల్ రక్తం లో తగిన పరిమాణం లో ఉన్న వారికి గుండె జబ్బులు తక్కువ గా వస్తాయని అనేక పరిశోధనల వల్ల ఖచ్చితం గా నిర్ధారణ అయింది.
ఈ HDL కొలెస్టరాల్ ఎంత ఉండాలి? :
60 mg. % లేక మిల్లీ మోల్స్ లో 1.55 మిల్లీ మోల్స్ per litre కన్నా ఎక్కువ ఉంటే వారికి గుండె జబ్బు రాకుండా రక్షణ ఇస్తుంది.
పురుషులలో 40 mg.% అంటే , స్త్రీలలో 50 mg %, అంటే మిల్లీ మోల్స్ లో చెప్పాలంటే 1.03 mmols per litre కన్నా తక్కువ ఉంటే వారికి గుండె జబ్బు రిస్కు ఎక్కువ గా ఉంటుంది.
ఇంకో రకం గా కూడా గుండె జబ్బు రిస్కు ను చెపుతారు.
మన రక్తం లో HDL కొలెస్టరాల్, LDL కొలెస్టరాల్ నిష్పత్తి . సాధారణం గా ఈ నిష్పత్తి 2.5 – 4.5: 1 ఉండాలి. అంటే మన రక్తం లో LDL ఒక భాగం ఉంటే , HDL రెండున్నర నుంచి నాలుగున్నర పాళ్ళు ఉండాలి. అంటే మంచి కొవ్వు లేక గుడ్ కొలెస్టరాల్ అయిన HDL , ఎక్కువ పాళ్ళు ఉండి LDL తక్కువ గా ఉండాలి.
మరి మనకు ఇంత మంచి చేసే ఈ మంచి HDL or Good cholesterol ఎలా మన రక్తం లో ఎక్కువ నిష్పత్తి లో ఉండేట్టు చూడడం ? :
అనేక శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఈ క్రింది విషయాలు తెలిశాయి.
అధిక బరువు తగ్గడం, క్రమం గా వ్యాయామం చేయడం, ( trans fats ) , ట్రాన్స్ ఫ్యాట్స్ మన ఆహారం లో లేక పోవడం, నికోటినిక్ యాసిడ్ అనే విటమిన్ మన ఆహారం లో ఉండడం, స్మోకింగ్ మానడం
( అంటే స్మోకింగ్ చేస్తున్న వారు ఆ అలవాటు మానుకున్నా వారిలో గుడ్ కొలెస్టరాల్ పెరుగుతుందన్న మాట ) , మన ఆహారం లో ఒమేగా – 3- ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం,( అంటే Omega-3-fatty acids ), మన ఆహారం లో పీచు పదార్ధం ఎక్కువ గా ఉండేట్టు చూసుకోవడం, మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ మన ఆహారం లో ఉండడం – ఈ చర్యలన్నీ మన రక్తం లో HDL కొలెస్టరాల్ శాతాన్ని పెంచి, గుండె జబ్బు రిస్కు తగ్గిస్తాయి.
( ఈ ‘ మంచి ‘ HDL కొలెస్టరాల్ చిత్రం క్రింద చూడండి, అందం గా ఉంది కదూ ! )

( ఈ టపా మీకు నచ్చితే, మీ అభిప్రాయాలతో పాటు , www.baagu.net. గురించి మీ ప్రియ స్నేహితులకు చెపుతారు కదూ ! )
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !