హై బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి?.14.
మనం ఇప్పటి వరకూ గుండె, రక్తనాళాలకు సంబంధించిన వివరాలలో , హై బీ పీ అంటే అధిక రక్త పీడనానికి కారణ భూతమయే రిస్కు ఫ్యాక్టర్ల గురించి వివరం గా తెలుసుకున్నాము. ఇందులో నివారించ తగ్గ రిస్కు ఫ్యాక్టర్లు మనం అశ్రద్ధ చేసిన కొద్దీ , వాటి ప్రభావం మన గుండె మీదా , రక్తనాళాల మీదా ఎంత తీవ్రం గా ప్రభావం చేస్తాయో మనకు చాలా వరకు అవగాహన అయింది కదా!
ఇక మనం హై బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయో చూద్దాము .
హై బీ పీ అంటే అధిక రక్త పీడనం షుమారు తొంభై శాతం కేసులలో కారణం ఖచ్చితం గా తెలియదు అని. కానీ రిస్కు ఫ్యాక్టర్లు మనకు ఎక్కువ అవుతున్న కొద్దీ ( మనం ఎక్కువ చేసుకుంటున్న కొద్దీ అనవచ్చు ) ఈ హై బీ పీ కూడా త్వరగా మనల్ని చేరి , చికిత్స కు కూడా సరిగా కంట్రోలు కాక పోవచ్చు.
తల నొప్పి : తలనొప్పి చాలా సాధారణమైన లక్షణం కదా ! అందు వల్ల మనం ఈ లక్షణాన్ని సాధారణం గా అశ్రద్ధ చేస్తుంటాము. ఎందువల్ల నంటే , పని వత్తిడి ఎక్కువ గా ఉందనుకునో, లేక మనం ఉన్న చోట గాలి స్వచ్చం గా లేదనో , లేక చాలా ఇరుకు గా ఉన్న చోట అంటే crowded space లో ఉన్నామనుకునీ , ఈ తల నొప్పిని మనం అశ్రద్ధ చేస్తాము. మరీ ఎక్కువ గా ఉంటె, క్రోసిన్ బిళ్ళలు కానీ, బ్రూఫెన్ బిళ్ళలు కానీ వేసుకుని , కాఫీ అయినా , టీ అయినా తాగుతాము. విశ్రాంతి కూడా తీసుకుంటాము.
అంత వరకూ బాగానే ఉంది. మనం జాగ్రత్త పడవలసినది ఎప్పుడంటే, ఈ తల నొప్పి తరచూ వచ్చి, చాలా సమయం వరకూ తగ్గక పోవడం, లేక అసలు తగ్గకుండా , అలాగే ఉండడమూ జరిగినప్పుడు అంటే అప్పుడు ఈ తల నొప్పిని పర్సి స్టెంట్ హెడేక్ లేక persistent headache అంటారు. ఇలా పర్సిస్టెంట్ హెడేక్ ఉండటం , హై బీ పీ లక్షణం కావచ్చు. ఇలా జరిగినప్పుడు అశ్రద్ధ చేయ కూడదు. కనీసం ఒక సారి అయినా రక్త పీడనం , అంటే బీ పీ చెక్ చేయించుకోవాలి డాక్టర్ దగ్గర కు వెళ్లి.
కళ్ళు బైర్లు కమ్మినట్టు ఉండడం లేక చూపు స్పష్టం గా లేక పోవడం ( blurred vision or double vision ) :
హై బీ పీ ఉన్నప్పుడు కళ్ళలో ఈ లక్షణాలు ఎందుకు ఉంటాయి ? : మనం తెలుసుకున్నాము కదా, అధిక రక్త పీడనం ప్రభావం ఎక్కువ గా అతి సన్నని , లేక సూక్ష్మ రక్త నాళాల మీద ఉంటుందని, అంటే కంటి లో, మెదడు లో , మూత్ర పిండాలలో , లేక , గుండె లో ఉండే రక్త నాళాలలో. అందు వల్ల కంటిలో దృష్టి మందగించినట్టు అనిపించడమూ, లేక చూసే వస్తువు కానీ , చదివే అక్షరం కానీ చేదిరినట్టు అనిపించడమూ , లేక ఒక అక్షరం కానీ , వస్తువు కానీ రెండు గా కనిపించడమూ, జరుగుతుంటాయి.
ఇలా జరిగినప్పుడు, కంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళే ముందు, బీ పీ చెక్ చేయించుకోవడం ముఖ్యంగా చేయవలసిన పని. ఎందుకంటే, హై బీ పీ కనక ఉన్నట్టయితే, కళ్ళ జోడు వాడినా, ఆ లక్షణాలు తగ్గవు కదా !
ముక్కులో నుంచి రక్తం కారటం : ( epistaxis ): కొందరిలో అధిక రక్త పీడనం ఉన్నప్పుడు , వారి ముక్కు లోనుంచి రక్త స్రావం అవుతుంది. ఎందుకంటే, ముక్కు లో కూడా , అతి సున్నితమైన రక్త నాళాలు , అధిక రక్త పీడనానికి తట్టుకోలేక చిట్లి పోతాయి. అప్పుడు రక్త స్రావం అవుతుంది. అందు వల్ల ఈ లక్షణాన్ని కూడా అశ్రద్ధ చేయ కూడదు.
ఇంకొందరిలో అధిక రక్త పీడనం ఉన్నప్పుడు వారు అంతకు ముందు కంటే ఎక్కువ ఆయాస పడుతుంటారు , వారు చేసే పనులలో. ఇది కూడా హై బీ పీ లక్షణం కావచ్చు.
చూశారు కదా పైన ఉన్న లక్షణాలు అతి సాధారణమైనవి గా ఉన్నప్పటికీ, హై బీ పీ కి మొదట కనపడే వార్నింగ్ సైన్స్ అవవచ్చు. మన నేత్రాలు కూడా ఈ లక్షణాలు చూపిస్తే, అప్పుడు మనం , మన మనో నేత్రం తెరిచి మనం తగు జాగ్రత్త తీసుకోవాలి కదా !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !
( ‘ బాగు ‘ మీకు నచ్చితే , మీ ‘ బాగు ‘ కోరుకునే మీ ప్రియ స్నేహితులకు కూడా ‘ www.te.wordpress. లో www.baagu.net. గురించి చెపుతారు కదూ ! )
informative, educative and good
Thanks Sharma gaaru.