సర్వైకల్ క్యాన్సర్. 4. CIN for no sin !
సిన్ ఫర్ నో సిన్ :
రమణి చక్కటి ఇల్లాలు. ముప్పై రెండు ఏళ్ళు ఉన్నాయంటే ఎవరూ నమ్మరు. ఇద్దరు రత్నాల లాంటి పిల్లలు. క్రమ శిక్షణ తో పెరిగింది. కాలేజీ జీవితం బాగా ఎంజాయ్ చేసినా, హాస్టల్ లో ఉన్నా, ఎప్పుడూ ‘ తను గీసుకున్న హద్దులు ‘ దాట లేదు. స్పష్టం గా చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్స్ తో స్నేహం రుచులు మాత్రమే ఆస్వాదించింది. తన జీవిత పధకం ప్రకారం ఇరవై రెండేళ్లకు, చదువు అయ్యాక పెళ్లి చేసుకుంది, గౌతమ్ ను. గౌతమ్ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే ‘ బ్రహ్మచర్యాన్ని అతి పవిత్రం గా కాపాడు కుంటున్నాడని ‘ తన కాలేజీ లో క్లాస్ మేట్స్ చాలా మంది రెచ్చ గొట్టే వారు గౌతమ్ ను. అయినా సరే, ఎప్పుడూ అలాంటి మాటలు పట్టించుకునే వాడు కాదు . ప్రవరాఖ్యుడి లా తన విద్యార్ధి జీవితం గడిపాడు. తన ‘ దీక్ష’ కు దైవం ఇచ్చిన ‘ ప్రసాదం’ గా భావించి, రమణిని , తన సహా చారిణి గా, ఒక ‘ అమూల్యమైన సుగంధ సుమం’ లా చూసుకుంటాడు. వారిరువురి ప్రేమా, దాంపత్య సుఖం కలగలిసి ఇద్దరు రత్నాల వంటి పిల్లలకు జన్మ నిచ్చాయి.
ఒక శుక్ర వారం నాడు ఆఫీసు నుంచి ఫోన్ చేశాడు గౌతమ్, ఆ రోజు సాయంత్రం వంట ఏర్పాట్లు ఏవీ చేయద్దనీ, ముగ్గురూ రెడీ గా ఉంటే, మంచి రెస్టారెంట్ లో భోజనం చేసి ఇంటికి రావచ్చనీ.
సాయంత్రం రెస్టారెంట్ లో ఫామిలీ సెక్షన్ లో కూర్చుని గౌతమ్ అత్యంత రుచికరమైన డిషెస్ తింటూ వాటి సిసలైన టాపింగ్స్ గా రమణి అందాలనూ, తమ ఇద్దరి ప్రేమ ఫలాలనూ ఊహించుకున్నాడు. చాలా ఆనందం గా ఉంది, ఆ చిన్న కుటుంబాని కంతటికీ.
ఇంటికి రాగానే అలసిపోయారేమో పిల్లలిద్దరూ వెంటనే నిద్ర పోయారు. గౌతమ్ రమణి చేయి తీసుకున్నాడు అతి సున్నితంగా, రమణి కి కూడా నిద్ర వచ్చీ రాకుండా ఉంది. బుగ్గలు ఎరుపెక్కాయి సిగ్గుతో ! ‘ ఆ సిగ్గు చూస్తె పెళ్ళైన కొత్తల్లో ఉన్న రమణి గుర్తొస్తున్నది ‘ అన్నాడు గౌతమ్. అప్రయత్నంగానే రమణి మనసు పులకించింది. తన దేహం తన వశం లో లేదు. వాడి పోయిన పూవు లా గౌతమ్ భుజాల మీద వాలి పోయింది, మగత గా ! ఆ మగత కేవలం నిద్రలేకనే కాదని గౌతమ్ కూ తెలుసు. ఆ రాత్రి ఇంకో సారి మారింది, గౌతమ్ కూ రమణి కీ, రమణీయం గా !
ఉదయం ఎప్పుడూ లేనిది , గౌతమ్ ను నిద్ర లేపింది ఐదింటికే ! విచారం గా కూర్చొని ఉంది బెడ్ మీద రమణి. తమ పదేళ్ళ దాంపత్య జీవితం లో గౌతమ్ ఎప్పుడూ చూడ లేదు రమణిని అలా ! వెంటనే తన కు హత్తుకొని అడిగాడు ఏమైందని.
రమణి రూం లో కింద పడేసి ఉన్న తన నైటీ ని చూపించింది తన వేలితో. తెల్లటి నైటీ కి రక్తపు మరక ! కొన్ని క్షణాలు అలా చూస్తూనే ఉండి పోయాడు గౌతమ్. పీరియడ్స్ మొదలయాయా ? అని అడిగాడు అచేతనంగా. తల ప్రక్కలకు ఊపుతూ, ‘ క్రితం శుక్రవారం ఐదో రోజు ‘ . ‘ ఇలా ఎప్పుడూ జరగ లేదు ‘ తగ్గు స్వరం తో అన్నది రమణి. ఖిన్నుడయాడు గౌతమ్. పైకి తన భావాలు కనబడ నీయలేదు. ‘ ఇప్పుడెలా ఉంది ? ‘ అన్నాడు. ‘ మామూలు గానే ఉంది. నొప్పి కూడా ఏమీ లేదు ‘ అన్నది రమణి.
‘ ఈ రోజే గైనకాలగిస్ట్ దగ్గరికి వెళ్దాము, భయ పడకు ‘ అన్నాడు కానీ తను కూడా ఆందోళన పడుతూ ఉండడం వల్ల ‘ భయ పడకు ‘ అన్న మాట ధైర్యం గా అన్నట్లు వినిపించలేదు రమణి కీ !
పిల్లల్నిద్దరినీ బంధువుల ఇంట్లో దింపి , దగ్గరలో ఉన్న కార్పోరేట్ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ కు చూపించాడు రమణిని. అన్ని వివరాలూ కనుక్కొని ‘ ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయాలి ‘ అన్నది ఆవిడ.
రమణి, గౌతమ్ లు ఏది జరగ కూడదనుకున్నారో అదే జరిగింది. గైనకాలజిస్ట్ ఇద్దరినీ కన్సల్టింగ్ రూం లో కూర్చోబెట్టి ఇలా చెప్పింది
‘ రమణీ నీకు సర్వైకల్ క్యాన్సర్ ఉంది. ఇది మీ అదృష్టం వల్ల చాలా తోలి దశలోనే తెలుసుకోవడం జరిగింది. నీకు జరిగిన రక్త స్రావాన్ని’ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ‘ అంటారు అంటే రతి క్రియ జరిగిన వెంటనే కలిగే బ్లీడింగ్. అది సాధారణం గా జరగదు కదా. మీరు వెంటనే నా దగ్గరికి వచ్చి మంచి పని చేశారు. ప్యాప్ స్మియర్ టెస్ట్ లో నీ సర్విక్స్ కణాలు కొన్ని క్యాన్సర్ కణాలు గా మారాయి. దీనినే CIN లేక ‘ సర్వైకల్ ఇంట్రా ఎపితీలియల్ నియోప్లాసియా ‘ అంటారు. మిగతా పరీక్షలు చేసి ఒక సారి ఆ కణాలు స్ప్రెడ్ అవలేదని నిర్ధారించిన తరువాత, ఒక చిన్న ప్రొసీజర్ తో ఆ క్యాన్సర్ కణాలను తీసి వేయడమో, లేసర్ తో కరిగించ డమో చేయ వచ్చు. ‘ ఈ క్యాన్సర్ రావడం లో మీ ఇద్దరి తప్పూ ఏమీ లేదు. ఇది HPV అనే వైరస్ వల్ల వస్తుంది’.
అతి భారంగా హాస్పిటల్ బయటకు నడిచాడు గౌతమ్, వాడి పోయినట్టు ఉన్న తన ‘ సుగంధ సుమం పరిమళాన్ని’ మునుపటి కన్నా ఎక్కువ ప్రియం గా ‘ ఆఘ్హ్రా ణిన్చుతూ ‘ !
చాలా బాగా అర్థమయెట్టుగా ఉంటున్నాయి మీ పో్స్టులన్నీ..ఇలాగే కొనసాగించండి.
ధన్యవాదాలు.
థాంక్స్ రాజేష్ మీ కామెంట్స్ కు.