సర్వైకల్ క్యాన్సర్.1. కారణాలు.
సర్వైకల్ క్యాన్సర్ కారణాలు తెలుసుకునే ముందు మనం DNA గురించి తెలుసుకోవాలి.
DNA అంటే De oxy Ribo Nucleic Acid. తెలుగులో డీ ఆక్సీ రైబో న్యుక్లిక్ యాసిడ్. ఈ డీ ఎన్యే సృష్టి లో ప్రతి జీవ కణం లోనూ ఉంటుంది. మనం ‘ పొగాకు కు ఋణం – ప్రాణం పణం ‘ . అనే టపా ల పరంపర లో తెలుసుకున్నాము , ఈ డీ ఎన్యే శ్వాస కోశ క్యాన్సర్ కు ఎట్లా కారణం అవుతుందో ! ( వివరాలు మళ్ళీ తెలుసుకోవాలని ఉంటే ఆర్కివ్స్ లో చూడండి ) ఖచ్చితం గా అదే పద్ధతిలో ఈ డీ ఎన్యే లో కలిగే మార్పులు సర్వైకల్ క్యాన్సర్ కు కూడా కారణం.( లంగ్ క్యాన్సర్ లో ఆ పనిని స్మోకింగ్ చేయటం వల్ల విడుదల ఆయే టాక్సిన్ లు అంటే విష పదార్ధాలు చేస్తాయి ) కాకపొతే, సర్వైకల్ క్యాన్సర్ లో డీ ఎన్యే మార్పులకు ఒక రకమైన వైరస్ కూడా కారణం అవుతుంది.
అది ఎట్లా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము:
DNA , దేహం లో ప్రతి జీవ కణం లోనూ ఉండే అతి సూక్ష్మమైన , మెమరీ. ఈ మెమరీ లో మన దేహం లో జరిగే ప్రతి యొక్క జీవ క్రియ కు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. అంటే కేవలం బయట కు కనిపించే బాహ్య లక్షణాలే కాక, ప్రతి నిత్యం మన దేహం లో జరుగుతున్న వేలకొద్దీ జీవ రసాయన చర్యలు కూడా ఈ డీ ఎన్యే లో నిక్షిప్తమై ఉన్న, నిర్దేశించిన పద్ధతులలో జరుగుతాయి. ఇందులో జీవ కణాల ప్రత్యుత్పత్తి కూడా. మన దేహం లో వేలు, లక్షల కొద్దీ జీవ కణాలు, ప్రతి రోజూ ప్రత్యుత్పత్తి అవుతుంటాయి, పాత కణాలు నశిస్తూ ఉంటాయి. ఉదాహరణ కు మన చర్మం మీద ఉండే ఎపిడెర్మల్ కణాలు నిరంతరమూ పాతవి ‘ ఊడి’ పోయి, కొత్త కణాలు ఏర్పడుతుంటాయి. మనం సాధారణంగా ఈ మార్పులను గమనించ లేము, సూక్ష్మ దర్శిని తో చూస్తే తప్ప.
ఈ విషయం ఎందుకు ప్రస్తావించ వలసి వచ్చిందంటే , ఈ కొత్త జీవ కణాలు ఎప్పుడు ఏర్పడినా, అవి ఖచ్చితం గా పాత కణాల లానే ఉంటాయి. ఎందుకంటే పాత కణాలలో ఉండే డీ ఎన్యే లో ఉన్న ‘ మెమరీ ‘ వల్ల ! ఇదే మెమరీ మన జీవ కణాల సంఖ్యను కూడా నియంత్రిస్తుంది. అందువల్ల నే మనకు నిరంతరం చర్మం లో పాత కణాలు పోయి, కొత్త కణాలు పుడుతున్నా, అవి ఒక నియంత్రిత సంఖ్య లో ఉండటం వల్ల మన చర్మం అనేక పొరలు గా ఉండదు కదా! ఇదే ఉదాహరణ మన దేహం లో కణ విభజన జరిగి కొత్త కణాలు ఏర్పడుతున్న ప్రతి చోటా వర్తిస్తుంది.
అయితే ఏ కారణం అయినా ఈ కణ నియంత్రణ చేసే డీ ఎన్యే ‘ మెమరీ ‘ ని మార్చి వేస్తె , అపుడు జీవ కణాలు, అనియంత్రిత సంఖ్య లో పుట్టి , క్యాన్సర్ గా పరిణమిస్తాయి. మన దేహం లో ఈ బాగం లో క్యాన్సర్ వచ్చినా డీ ఎన్యే లో మార్పుల వల్ల జరిగే అనియంత్రిత కణ విభజన వల్లనే. లంగ్ క్యాన్సర్ అయినా , సర్వైకల్ క్యాన్సర్ అయినా , ఏ క్యాన్సర్ అయినా !
సర్వైకల్ క్యాన్సర్ కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ అని పరిశోధనల వల్ల తెలిసింది. ఈ వైరస్ నే HPV వైరస్ అంటారు. ఈ వైరస్ కధా కమామీషు , అంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎట్లా సర్వైకల్ క్యాన్సర్ కు కారణమవుతుంది, ఈ HPV వైరస్ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాము.
ఈ విషయాలు అందరూ తెలుసుకోవాలి. ప్రత్యేకించి , యువత, వారి తల్లి తండ్రులు. ఎందుకంటే ప్రపంచీకరణ పర్యవసానంగా మన దేశం లో యువత జీవన శైలి, ప్రత్యేకించి వారి సెక్స్ అంటే కామ జీవితం లో జరుగుతున్న మార్పులు, వాటి పరిణామాలు ఎట్లా ఉండ గలవో తెలుసుకోవడానికీ , ఇంకా వారు తగిన జాగ్రత్తలు తీసుకోడానికీ !