ఋతుక్రమం- సమస్యలు. 8.అస్తవ్యస్త ఋతుస్రావం.
యనోవ్యులేటరీ ఋతుస్రావం :
ఈ రకమైన ఋతుస్రావం పేరులో ఉన్నట్టు, అస్తవ్యస్తం గా జరుగుతుంది. కానీ ఈ అస్తవ్యస్త ఋతు స్రావం లో అండాశయం నుంచి అండం విడుదల అవదు.
అస్తవ్యస్తం గా జరిగే ఋతు స్రావాలలో 90 శాతం అంటే నూటికి తొంభై మంది లో ఈ రకమైన ఋతుస్రావం జరుగుతుంది.
ఇలాంటి ఋతుస్రావం సాధారణం గా రజస్వల అయిన మొదటి నెలలలో ఇంకా మెనోపాజ్ అంటే రుతుక్రమం ఆగి పోయే దశలో ఎక్కువ గా కనిపిస్తుంది.
ఇలాంటి సమయాలలో అండాశయం నుంచి అండం విడుదల అవక పోవడం వల్ల , ఈస్త్రోజేన్ ఎక్కువ గా విడుదల అయి గర్భాశయ లైనింగ్ పొర మందం గా ఏర్పడుతుంది. అందువల్ల
ఋతుక్రమం సరి అయిన సమయం లో అవదు. అయినా ఎక్కువ రోజులు ఋతుస్రావం అవటం జరుగుతుంది.
ఇలా అండం విడుదల అవకుండా ఋతుస్రావం అవడం ఇంకా కొన్ని పరిస్థితులలో కూడా జరుగుతుంది.
తీవ్రం గా మానసిక వత్తిడి ఉన్నప్పుడు, అతి సన్న గా ఉన్నా లేక అతి లావు గా ఉన్నా , లేక ఆకస్మికం గా స్త్రీ బరువులో హెచ్చు తగ్గులు అయినప్పుడు, లేక థైరాయిడ్ లాంటి హార్మోనులకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కూడా , లేక ఎక్కువ అంటే అతి గా వ్యాయామం చేసినా కూడా ఋతు స్రావం అస్తవ్యస్తం కావచ్చు.
ఎలా కనుక్కోవాలి? :
వివరమైన వైద్య చరిత్ర అంటే లక్షణాలు మొదలైన దగ్గరినుంచి, వాటి తీవ్రత, ఆ లక్షణాలకూ ఋతుక్రమం లో వాటి సమయానికీ ఉన్న సంబంధమూ , ఈ వివరాలన్నీ స్త్రీలు గమనించి స్పెషలిస్ట్ వైద్యులు అడిగినప్పుడు చెబితే చాలా ఉపయోగ కరం గా ఉంటుంది , ఎ రకమైన సమస్యో ఖచ్చితమైన నిర్ధారణ చేయటానికి.
అలాగే ఎంత రక్తస్రావం జరిగిందో తెలుసుకోవడానికి హీమో గ్లోబిన్ పరీక్ష, హార్మోనుల పరీక్షలు అంటే థైరాయిడ్ హార్మోను, ఈస్త్రోజేన్, LH హార్మోనుల పరీక్షలు కూడా అవసరం అవుతాయి.
కొన్ని ప్రత్యెక సందర్భాలలో Beta HCG, androgen, TSH, FSH, prolactin లాంటి హార్మోనులు శరీరం లో ఎంత పరిమాణం లో ఉన్నాయో తెలుసుకోవడం అవసరం ఉంటుంది.
శబ్ద పుంజాలతో అంటే అల్ట్రా సౌండ్ తో గర్భాశయ స్కానింగ్ చేయడము, గర్భాశయ లైనింగ్ కణజాలం పరీక్ష చేయడము కూడా అవసరం రావచ్చు, ఉన్న సమస్య ను బట్టి.
చికిత్స ఏమిటి ? :
రక్త హీనత ఎక్కువ కాకుండా ఇనుము అంటే ఐరన్ టాబ్లెట్లు తీసుకుంటుండాలి క్రమం గా.
హార్మోనుల తో అంటే ఈస్త్రోజేన్ తో కానీ ప్రోజేస్తిరాన్ తో కానీ చికిత్స చేసి, సాధారణం గా ఈ అస్తవ్యస్త రుతుక్రమాన్ని సరి చేస్తారు గైనకాలజిస్టులు.
కొన్ని ప్రత్యెక పరిస్థితులలో గర్భాశయం తీసి వేయ వలసిన అవసరం రావచ్చు.
ఆపరేషన్ అవసరం లేకుండా గర్భాశయం లోకి ఒక సూక్ష్మమైన కెమెరా పోనిచ్చి గర్భాశయ లైనింగ్ ను ఒక రకం గా మాడ్చి వేసి అధిక రక్త స్రావం కాకుండా నివారించడం కూడా ఒక ఆధునిక పధ్ధతి. దీనిని ఎండో మెట్రి యల్ అబ్లేషన్ అంటారు. ( పైన ఉన్న పటం చూడండి )
ఇలాంటి సమస్య ఉన్న వారు స్పెషలిస్ట్ సలహా తీసుకోవడం అంటే గైనకాలజిస్ట్ ను సంప్రదించడం శ్రేయస్కరం.
వచ్చే టపా లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !