హార్ట్ అటాక్ నివారించేందుకు త్వరలో టీకా మందు !
ప్రపంచం లో గుండె జబ్బు ల ద్వారా సంభవించే మరణాలు చాలా ఎక్కువ. అందులో హార్ట్ అటాక్ వల్ల సంభవించే మరణాలు కూడా ఎక్కువే.
అయితే అందరికీ ఒక ఆశా జనకమైన వార్త !
స్వీడన్ లోని లుండ్ విశ్వ విద్యాలయం లోని శాస్త్రజ్ఞులు ప్ర ప్రధమం గా హార్ట్ అటాక్ ను నివారించడానికి ఒక మందు కనిపెట్టారు.
ఈ మందు టీకా రూపం లో కానీ ఇన్హేలర్ రూపం లో కానీ వచ్చే అయిదేళ్ళలో మార్కెట్ లో లభించ వచ్చు.
ఇంత వరకూ మానవులలో గుండె జబ్బు , హార్ట్ అటాక్ ను నివారించడానికి, కొలెస్టరాల్ తగ్గించుకోవడానికి మందులు వేసుకోవడమూ, ఇంకా అధిక రక్త పీడనం అంటే హై బీపీ తగ్గించడానికీ మందులు వాడడం జరుగుతున్నది.
కొలెస్టరాల్ ను తగ్గించుకోవడం ఎందుకంటే , ఒక రకమైన కొలెస్టరాల్ ( అంటే మనకు ప్రత్యేకించి మన రక్త నాళాలకు , హాని కలిగించే కొలెస్టరాల్ , దీనిని LDL కొలెస్టరాల్ అంటారు ) రక్త నాళాలలో పేరుకు పోయి క్రమేణా వాటిని పూడ్చి వేస్తుంది. ( పై చిత్రం చూడండి )
అలా గుండెకు సరఫరా చేసే రక్తనాళాలు పూడుకు పోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఇలా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, ప్రస్తుతం ఉన్న చికిత్సా విధానాలలో, ఆ ‘ పూడిక ‘ ను కరిగించడానికి లేక పూడుకు పోయిన రక్తనాళాలను తప్పించి కృత్రిమంగా చిన్న ట్యూబ్ లను ఆ రక్తనాళాలకు అమర్చడమూ చేయడం జరుగుతున్నది.
ఇలా రక్తనాళాలు పూడుకు పోకుండా నివారించడం లో యాంటీ బాడీస్ కూడా పాత్ర వహిస్తాయి. ఇక్కడ మనం యాంటీ బాడీస్ అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. మన దేహం లో ఉండే రోగ నిరోధక శక్తి దానినే ఇమ్యూ నిటీ అంటారు. మనం చిన్న తనం లో వచ్చే జబ్బులు, మంప్స్ , మీసిల్స్ , డిఫ్తీరియా లాంటి జబ్బులు నివారించడానికి టీకాలు వేయించడం చేస్తుంటాము. ఇలా చేయడం వల్ల మన దేహం లో సహజం గానే ఉన్న రోగనిరోధక శక్తి టీకా ల వల్ల ఇంకా ఎక్కువ అయి, ఆ జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఈ స్వీడిష్ శాస్త్రజ్ఞులు, ఒక మందు కనుక్కొన్నారు. ఈ మందు గుండె కు సరఫరా చేసే రక్తనాళాలలో కొలెస్టరాల్ పేరుకు పోకుండా నివారించే యాంటీ బాడీస్ ను ఎక్కువ గా ఉత్పత్తి చేసేటట్టు , మన రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూ నిటీ ని ప్రేరేపిస్తుంది. అంటే స్టిమ్యులేట్ చేస్తుందన్న మాట.
లుండ్ విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ నిల్సన్ ఇలా అన్నాడు ‘ ప్రస్తుతం వాడకం లో ఉన్న అధిక రక్త పీడనకు, ఇంకా అధిక కొలెస్టరాల్ కూ మందులు కేవలం నలభై శాతం మాత్రమే తగ్గిస్తున్నాయి గుండె జబ్బులను. మిగతా అరవై శాతం గుండె జబ్బులు సంభవిస్తూ నే ఉన్నాయి ప్రపంచం లో వాటిని కూడా నివారించడానికే ఈ ప్రయత్నం ‘ ఆయన ఆధ్వర్యంలో ఎలుకల మీద జరిగిన పరిశోధనలో వాటి రక్త నాళాలలో కొవ్వు అంటే కొలెస్టరాల్ పూడుకు పోవడం అరవై నుంచి డెబ్బయి శాతం వరకూ తాము కనుక్కొన్న మందు తగ్గించిందని కనుగొన్నారు. కెనడా లోనూ , అమెరికా లోనూ మానవులమీద కూడా పరిశోధన జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఈ పరిశోధనలు ఇప్పటివరకూ ఆశా జనకం గా ఉన్నాయి.
శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం వచ్చే అయిదేళ్ళలో టీకా మందు ఒక ఇంజెక్షన్ రూపం లోనో లేక ముక్కులో వేసుకునే స్ప్రే రూపం లోనో లభించనున్నది. అయితే ఈ మందు చాలా ప్రియమైనది. అందు వల్ల హై రిస్క్ కు చెందిన వారికే ఈ మందు రికమెండ్ చేస్తారు.
కొస మెరుపు :’ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ‘ నివారణకు తీసుకునే చర్యలు ( అంటే మందులు లేకుండా జీవన శైలి లో మార్పు అంటే life style changes ) ఉత్తమం, చౌక కూడా !!
( డైలీ టెలిగ్రాఫ్ సౌజన్యం తో )