కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.8.
ముందాట లేక ‘ foreplay ‘ :
ప్రేయసీ ప్రియులలో కామోత్తేజం ఎక్కువ చేసి వారిని రతిక్రియకు ప్రేరేపించి , సంసిద్ధత చేసే ఏ క్రియ అయినా ముందాట లేక ‘ foreplay ‘ అనబడుతుంది.
దేశ, ప్రాంత, కాల, మత పరిస్థితులను బట్టి మారుతుంటుంది ఈ ముందాట. ఈ సంసిద్ధత మానసికమైనది, భౌతికమైనదీ కూడా.
మానసికంగా ఆడే ముందాట లో , ప్రియురాలిని మొదట ప్రణయ సంభాషణతో కవ్వించడము. internet ద్వారా chat line లో సంభాషణ, mobile లో SMS messages, కూడా ఈ కోవలోకి వస్తాయి.
ఈ విషయం లో మన సినీ కవులు అత్భుత ప్రతిభ కనబరచారు పాటల లో.
ఉదాహరణకు ఈ పాట చదవండి:
( వీలు చేసుకుని కనీసం వీడియో కాక పోయినా ఆడియో వినండి ) :
మెల్ల మెల్ల మెల్లగా, అణువణువూ నీదెగా, మెత్తగ అడిగితే లేదనేది లేదుగా,
నాది కానిదేది లేదు నాలో, నిజానికే నేనున్నది నీలో, అని ఆమె అంటే
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో, ఆ ఒక్కటీ చిక్కె నీ గుప్పిటిలో అని అతడంటాడు
నిన్ను చూసి నన్ను నేను మరచినాను, నన్ను దోచు కొమ్మనీ నిలిచినాను అని అతడంటే
దోచుకుందమనే నేను చూసినాను, చూచి చూచి నన్ను నువ్వె దోచినావు అని ఆమె
కన్నులకూ కట్టినావు ప్రేమ గంతలూ, కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు,అని ఆమె
దొరికినాము చివరకూ తోడు దొంగలం, దొరలమై ఏలుదాం వలపు సీమలూ అని అతడు
( పక్షుల కల కలల మధ్య ఆమె కామోత్తేజ నిట్టూర్పు !! )
ఇక్కడ ఆమె ప్రియుణ్ణి, తొందర పడవద్దని , తన శరీరం లో అణువణువూ ప్రియుడిదేననీ చక్కగా తెలిపింది. అతడు కూడా, తన మనసు ఆమె గుప్పిటి లోనే ఉందని, ‘ దొరలమై వలపు సీమ ఏలుదామనీ ఆమెను సమాయత్తం చేస్తున్నాడు మానసికం గా !
ఇంకో పాట :
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు, అందీ అందని అందమె ముద్దు,
విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు.
నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు అని అతడు,
పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు అని ఆమె,
చక చకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు అని అతడు
కలకాలం తల దాచుకోమ్మనే ఎడద ను చూస్తే ఏదో ముద్దు అని ఆమె
పచ్చని చేలే కంటికి ముద్దు, నెచ్చెలి నవ్వే జంటకు ముద్దు అని అతడు ,
చెట్టు చేమా జగతి కి ముద్దు, నువ్వు నేనూ ముద్దుకు ముద్దు అని ఇద్దరూ !!
ముద్దు ఎన్ని రకాలు గా ఉంటుందో రమణీయం గా అచ్చ తెలుగులో వర్ణింప బడ్డది ఈ పాటలో ! ఇక్కడ ముద్దు ను ‘ ఇష్టత ‘ గా లేక ‘ లైకింగ్ ‘ అనే అర్ధం వచ్చేటట్లు వ్రాయ బడ్డది.
ఇంత చక్కటి పాట, పర్యావరణం కూడా దృష్టి లో ఉంచుకుని ప్రేయసీ ప్రియుల కోసం ఆ రోజులలోనే రాసినది, పై రెండు పాటలనూ మనసు కవి ఆత్రేయ.’ దాగుడు మూతలు సినిమా కోసం ఘంటసాల, సుశీల పాడినవి. పూర్తిగా ఆస్వాదించాలంటే మీరు ఈ పాటలు విన వలసిందే !
రాసిన రోజులలో ‘ నువ్వు నేను ముద్దుకు ముద్దు’ అన్న మాట ను సెన్సారు వాళ్ళు అభ్యంతరం తెలిపి తొలగించారు సినిమా లో !!! మీరు ఊహించవచ్చు , అలాంటి అభ్యంతరాలు ఈ రోజులలో ఉంటే పరిణామాలు ఎలా ఉండేవో !
తరువాతి టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !