పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 14. పొగాకు అలవాటు మానించే మందులు ఎట్లా పని చేస్తాయి?
ఇంతవరకూ టపా లలో పొగాకు పీల్చడం మనలో తెచ్చే విషాదకర పరిణామాలు ఎట్లా ఉంటాయో రాత పూర్వకంగానూ, వీడియో ల ద్వారానూ తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను.
మీ అభిప్రాయాలను స్వేఛ్చ గా తెలపండి, అవి మంచివి అయినా, కాక పోయినా. అట్లాగే ఏవైనా సాంకేతిక పరమైన లోపాలు ఉన్నా తెలియచేయండి, దయ చేసి.
ఇప్పుడు పొగాకు మానించే మందుల గురించి కొంత తెలుసుకుందాము.
ఇవి రెండు రకాలు.
1. నికోటిన్ రేప్లస్మేంట్ మందులు :
ఇవి, నోట్లో పెట్టుకుని చప్పరించే గం లేక బిళ్ళల లాగా, ముక్కులో స్ప్రే చేసుకునే ఇన్హేలర్ లాగా , చర్మము మీద రోజూ అతికించుకునే ప్యాచ్ ల లాగా మార్కెట్ లో లభ్యం అవుతాయి.
ప్రధానంగా వీటి ఉపయోగం, పొగాకు మానేశాక వెంటనే సాధారణం గా కలిగే క్రేవింగ్ లు ( క్రేవింగ్ గురించి క్రితం టపా లో చదివారు కదా ! ) తగ్గించడానికి.
కొన్ని వారాలు, కనీసం వీటిని వాడుతూ క్రమంగా తగ్గించి ఆపెయ్యడం ఒక పధ్ధతి.
వీటి ఉపయోగం మీద చాలామంది నిపుణులు సందేహాలు వ్యక్తం చేసారు. ఇటీవలి ఒక పరిశోధనలో కూడా ఈ నికోటిన్ రిప్లస్మేంట్ మందులు, ఏ మందులూ తీసుకోకుండా పొగాకు మానేసిన వారితో పోలిస్తే ఏమాత్రమూ ఎక్కువ లాభాకారిగా లేవు అని తేలింది.
పైగా డబ్బు దండగ !!! ఇంకోవిధంగా చెప్పాలంటే ఇక్కడ కూడా మీరు నికోటిన్ కు ఋణం ఉంటారు. మీకు డబ్బు బాగా ఉంటే, ఒక ఖచ్చితమైన పధకం తో వీటిని తీసుకొని క్రమం గా మానేస్తే వాటి లక్ష్యం, మీ లక్ష్యం నెర వేరినట్లే కదా !!!.
2. నికోటిన్ తో సంబంధం లేకుండా క్రేవింగ్ తగ్గించే మందులు :
ఇవి బ్యూప్రోపియోన్ , వెరినిక్లిన్ అనే మందులు. ఇవి ప్రధానంగా క్రేవింగ్ తగ్గించే మందులు. వీటిని కనీసం ఒకటి రెండు వారాల ముందు నుంచే మొదలు పెట్టి ( పొగాకు మానేసే రోజుకు ముందన్న మాట ) కనీసం ఆరు నెలల పాటు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈమందులు ఏవీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు కదా !!
మీ కృత నిశ్చయము అన్నిటికంటే మించిన మందు. ఎందుకంటే అది మీ మెదడు లోతులు అనండి , మీ హృదయపు లోతులు అనండి, అక్కడ నుంచి వస్తూంది. అదే మీ అలవాటు లో మార్పుకు పునాది. కృత నిశ్చయం లోపించినప్పుడు, ఎన్ని మందులు తీసుకున్నా,అవి పని చెయ్యవు సరి కదా, మీకు ఆర్ధికంగా ఇంకో భారంగా పరిణమించవచ్చు.
మీరు పైన తెలిపిన వాటిలో ఏవి వాడుదామని అనుకున్నా, వైద్య నిపుణుడి ని సంప్రదించి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ , లాభాలు వివరంగా చర్చించి తగు నిర్ణయం తీసుకోండి !!!.
తరువాతి టపాలో పొగాకు మాన్పించడం లో యువత పాత్ర గురించి చదవండి !!!