పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 13. పొగాకు మానేశాక, క్రేవింగ్ లు ‘ cravings ‘ వస్తే ఏంచేయాలి ?
పొగాకు క్రేవింగ్ అంటే రోజూ ముప్పయ్యో , నలభైయ్యో , సిగరెట్టులు పీల్చి పారేసే వారిలో ఒక్కసారి గా పొగాకు ( పీల్చడం ) మానేసిన మొదటి రోజుల్లో వచ్చే సైడ్ ఎఫ్ఫెక్ట్స్.
ఈ క్రేవింగ్ గురించి ఎంత మాత్రమూ భయ పడనవసరం లేదు. ఎందుకంటే ఒక సారి వాటి గురించి తెలుసుకున్నాక చాలా శులభంగా వాటిని మానేజ్ చెయ్యగలరు ఎవరైనా !!
తెలియనప్పుడు ఏదో ఉత్కంథత ఉంటుంది, ఆందోళనా, భయమూ ఉంటాయి. మీరు క్రేవింగ్ లక్షణాల గురించి తెలుసుకున్నాక ‘ ఇంతేనా ‘ అనిపిస్తుంది.
క్రేవింగ్ గురించి ఎప్పుడు తెలుసుకుందాము.
క్రేవింగ్ అంటే ‘ అదే ‘ కావాలనే తపన, ‘ అది’ పొందలేక పోతున్నందుకు మనసులో , శరీరంలో వచ్చే తాత్కాలిక మార్పులు. ఆ ‘ అది ‘ సిగరెట్టే కావచ్చు, ఆల్కహాలే కావచ్చు, లేక మాదక ద్రవ్యాలే కావచ్చు , ఇక్కడ గుర్తు ఉంచుకోవలసినది, ఆ యా పదార్ధాలను మొదట మన శరీరం రుచి చూసి ఉంటుంది. అంటే మన మెదడు లో ఉండే నాడీ కణాలు ఆ యా పదార్ధాలకు కనీసం కొన్ని రోజులో , వారాలో అలవాటు పడి ఉంటాయన్న మాట. ఈ క్రేవింగ్ నే ‘ withdrawal symptoms ‘ అని కూడా అంటారు.
పొగాకు క్రేవింగ్ లో ఈ మార్పులు పలు విధాలుగా ఉండవచ్చు. గుండె వేగంగా కొట్టుకోవడము, రక్త పీడనం ఎక్కువ అవటము, ఎక్కువ స్వేదం పట్టటము, నిద్ర లేమి, ఆందోళన అధికం అవటము, డిప్రెషన్ అనిపించటం , చిన్న విషయాలకు కూడా చీకాకు పడటము, కోపము, చుట్టూ ఉన్న వారిమీద ఆ కోపము అకారణంగా చూపించడమో, ఇవన్నీ క్రేవింగ్ లక్షణాలే !!!
ఈ క్రేవింగ్ కు కారణము, మన మెదడు లో ఉండే అనేక రకాల నాడీ గ్రాహకాలకు అంటే ‘ receptors ‘ కు అంత వరకూ ఒక క్రమమైన డోసు లో అందు తున్న నికోటిన్ అందకపోవడమే !
ఇలాంటి లక్షణాలు అనుభవం లోకి వచ్చినప్పుడు ముఖ్యం గా మీకు వీటి గురించి ముందు గా అవగాహన ఉంటే మీరు ఆందోళన పడకుండా వాటిని ఎదుర్కోవడానికి సన్న ద్దులు అవగలరు.
ఇక వాటిని ఎట్లా ఎదుర్కోవాలో చూద్దాము ఇప్పుడు:
మీలో భౌతికంగా వచ్చే మార్పులు:
ఎక్కువ గా చెమట పట్టడం, ఎక్కువ ఆకలి వేయటం, నిద్ర తగ్గిపోవటం, గుండె వేగం గా కొట్టుకోవడం; ఈ లక్షణాలు రెండు మూడు పర్యాయాలు చల్ల నీళ్ళతో నైనా , గోరు వెచ్చటి నీళ్ళ తో నైనా స్నానం చెయ్యటం, ఎక్కువ సార్లు రుచికరమైన ఆహారం తక్కువ మోతాదు లో ( small quantities ) తింటూ ఉండటం, ప్రశాంతంగా నిద్ర పోవటం, ఇలాంటి చిట్కాల తో సరి చెయ్య వచ్చు.
ఎక్కువ గా సిగరెట్టు పీలుద్దామని అనిపించినప్పుడు, నోట్లో ఒక చూఇంగ్ గం నో పెప్పర్ మింటో పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉండవచ్చు.
ఇక మానసికం గా వచ్చే మార్పులు :
ఎవరికి వారు మనసులో పదే పదే ‘ నేను సిగరెట్టు మానేశాను ‘ మళ్ళీ తాగాను కాక తాగను, ‘ నేను ఇప్పుడు స్మోకర్ ను కానే కాదు ‘ అని అనుకుంటూ ఉండాలి.
ఆందోళనా , టెన్షన్ ఎక్కువ గా ఉన్నప్పుడు, దీర్ఘ ఉచ్వాస, నిశ్వాస లు తీసుకుంటూ ఒకటి నుంచి పది లేక మీ ఇష్ట దైవాన్నో పది సార్లు ప్రార్ధన చేసుకోవడమూ చేస్తూ ఉండాలి.
మీరు పదే పదే గుర్తు చేసుకోవలసింది ఇంకోటి కూడా ఉంది. అది ‘ ఈ క్రేవింగ్ లు ఖచ్చితంగా తాత్కాలికమే , కొన్ని రోజులలో మటుమాయం అవుతాయి ‘ అనే యదార్ధం!!
అగరు వత్తులు, క్యాండిల్ వెలిగించి మీరు ఉంటున్న చోట సిగరెట్టు వాసనకు బదులు, వాటి సుగంధాలను వాసన చూడండి, మీకు సిగరెట్టు వెలిగించాలని తీవ్రమైన కోరిక కలిగినప్పుడు.
సిగరెట్టు పీల్చాలని అనిపించినప్పుడల్లా మీరు సిగరెట్టు వల్ల కలిగే, ఇంతకు ముందు తెలుసుకున్న విషాదకరమైన అనర్ధాలన్నీ సినిమా లో రీళ్ల లాగా మననం చేసుకోండి. గుర్తుకు తెచ్చుకోండి. అందు వల్లనే కదా నేను చిన్న చిన్న వీడియో క్లిప్పింగులు ఈ బ్లాగు లో ఉంచినది !!! అవసరమనుకుంటే వాటిని వల్లె వేయండి ( learn by heart ).అవి మీ ఆరోగ్యాన్ని కాపాడ గలిగే ఆణి ముత్యాలు !!!
వచ్చే టపాలో పొగాకు మాన్పించే మందుల గురించి తెలుసుకోండి !!