పొగాకుకు ఋణం – ప్రాణం పణం. 8. స్మోకింగ్ ఎట్లా మానాలి ?
గత ఏడు ( 7 ) టపాలలో పొగాకు వల్ల కలిగే హాని వివరం గా పొందు పరచడం జరిగింది.
ఈ టపా ల తో ఇప్పటి వరకూ పొగ తాగని వారు , ఇక ముందు కూడా తాగక పొతే వారి ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసింది కదా !!
ఇక పొగాకు తాగే వారు, ఆ అలవాటు మానుదామనుకుంటే ఈ క్రింది విషయాలు శ్రద్ధ తో చదవటం మంచిది.
పొగ తాగటం మానుదామనుకుని తీసుకునే నిర్ణయానికి ప్రధానం గా కావలసినది మీ ‘ కృత నిశ్చయం ‘
( అంటే ‘ determination ‘ ).
కృత నిశ్చయం ఉన్న వారు ఎవరైనా పొగాకు విజయ వంతంగా మానగలరు. అది అసంభవం కాదు.
ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు ఫలించక పోయినా బాధ పడనవసరం లేదు. నిరుత్సాహ పడనవసరం లేదు.
పొగాకు తాగటం మానిన వెంటనే కలిగే లక్షణాలు ముందే మీరు తెలుసుకుంటే తగు విధంగా మీరు మానసికంగా సన్నద్దులవ గలరు మీరు.
పొగాకు మానిన వెంటనే మీలో ఈ మార్పులు గమనించండి:
1. పొగాకు వెంటనే పీల్చాలనే తీవ్రమైన కోరిక ( దీనినే ‘ intense craving ‘ అంటారు ) కలుగుతుంది.
2. ఆందోళనా, అసహనమూ, మానసిక వత్తిడి ( అంటే టెన్షన్ ) కలగటం.
3. సుఖ నిద్ర కోల్పో వడమూ, చెడ్డ కలలు రావడము, ఏ పని మీదా ఏకాగ్రత కోల్పోవడమూ.
4. ఆకలి ఎక్కువ అవడము, బరువు పెరగడమూ.
5. చీటికి మాటికీ చికాకు పడడము, క్రుంగి పోవడమూ కూడా జరుగ వచ్చు ( అంటే డిప్రెషన్ ).
పైన చెప్పిన లక్షణాలు అన్నీ మానేసిన వారందరిలోనూ కనపడక పోవచ్చును. ఈ లక్షణాల తీవ్రత, ఎన్ని సిగరెట్టులు, ఎంతకాలం నుంచి పీలుస్తున్నారనే విషయాల పైన ఆధార పడి ఉంటుంది.
ఉదాహరణకు ఒక ఐదు సంవత్సరాలనుంచి రోజూ ఒక పది సిగరెట్టులు పీల్చే వారు, పది సంవత్సరాల నుంచి ఇరవై సిగరెట్టు లు పీల్చే వారికన్నా తక్కువ తీవ్రత తో ఈ లక్షణాలు అనుభవిస్తారు.
కానీ మీద ‘ పిడుగులు పడ్డా మీ నిర్ణయం మార్చు కోకూడదనే ‘ కృత నిశ్చయం తో ఉంటే మీరు తప్పక సఫలురవుతారు మీ ఈ ప్రయత్నం లో !!! విజయీభవ !!!
వచ్చే టపాలో మరి కొన్ని ‘ చిట్కా లు ‘ చదవండి.