పొగాకు కు ఋణం – ప్రాణం పణం – 4. ( మన రక్త నాళాల లో పొగాకు తెచ్చే మార్పులు ).
పొగాకు లేక సిగరెట్టు పీల్చడం వల్ల రక్తము లో నూ రక్తనాళాల లోనూ మార్పులు వస్తాయి.
రక్తము లో వచ్చే మార్పులు:
పొగాకు చాలా కాలం పీల్చడం వల్ల రక్తము లో ఉండే ప్లేట్ లెట్స్ అనే కణాలు సరిగా పని చేయక అవి గుంపులు గా ఏర్పడతాయి. సాధారణంగా ఈ ప్లేట్ లెట్స్ అనే రక్త కణాలు మన కు ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలితే ఆ ప్రాంతానికి ఎక్కువ సంఖ్య లో చేరుకొని మనకు ఎక్కువ రక్తస్రావం అవకుండా రక్తాన్ని గడ్డ కట్టించే క్రియ లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ ముఖ్యమైన క్రియ ను రక్త ఘనీకరణం లేక ‘ blood clotting ‘ అంటారు.
ఈ ప్లేట్ లెట్స్ గుంపులు గా ఏర్పడుతూ వుండటం వల్ల అతి సన్నని రక్త నాళాలు పూడుకు పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ అతి సన్నని రక్తనాళాలు ప్రధానం గా మన గుండెకు సరఫరా చేసే రక్త నాళాలు మరియూ మన మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు.
ఇక్కడ గమనించవలసినది ప్లేట్ లెట్స్ గుంపులు లేక సమూహాలుగా ఏర్పడటం మనకు ఏ దెబ్బా తగలక పోయినా జరుగుతుంది , పొగాకు పీల్చడం వల్ల.
రక్త నాళాలలో పొగాకు తెచ్చే మార్పులు:
పొగాకు చేసే ఇంకో హాని రక్తనాళాలను కుంచించుకు పోయేట్టు, మరియూ రక్తనాళాల గోడలను మందంగా చేయటం. ఈ విధంగా జరగటం వల్ల రక్తనాళాల వ్యాసం అంటే ‘ diameter ‘ తగ్గిపోయి రక్త పీడనం ఎక్కువ అవుతుంది. అంటే ‘ high blood pressure’ అన్న మాట.
ఇలా రక్త పీడనం ఎక్కువ అవటం వల్ల మెదడు లో ఉండే అతి సున్నితమైన రక్త నాళాలు ఈ ఎక్కువైనా రక్త పీడనానికి తట్టుకోలేక చిట్లి పోతుంటాయి.
దీనినే మనం పక్షవాతం లేక ‘ brain stroke ‘ అంటాము.
రక్త నాళాల లోనూ, రక్త ప్రసరణ లోనూ , రక్త కణాల లోనూ పొగాకు తెచ్చే ఈ మార్పులు ‘ గుండె పోటు ‘ అంటే ‘ heart attack ‘ కు కారణం అవుతాయి.
ఎక్కువగా పొగ తాగే వారికి ఈ ప్రమాదం పొంచి ఉంటూంది ఎప్పుడూ.
ఇదే కారణం వల్ల కొందరికి మూత్ర పిండాలు పాడైపోవడమూ, కొందరికి కంటిలోని రక్తనాళాలు దెబ్బ తిని , చూపు మందగించడం కూడా జరుగుతుంది.
కొందరిలో చేతి వేళ్ళ చివరలు, కాలి వేళ్ళ చివరలూ రక్తనాళాల్లో వచ్చే ఈ మార్పుల వల్ల రక్త సరఫరా బాగా తగ్గి పోయి, చచ్చు పడి పోతాయి.
పొగాకు మనలో తెచ్చే ఇంకొన్ని మార్పులు వచ్చే టపా లో చదవండి.