టొబాకో అనే స్పానిష్ పదము మొట్టమొదటిగా ‘తియన ‘ అనే కార్రిబియన్ భాష నుంచి పుట్టింది. ఈ టొబాకో నికోటియాన అనే జాతి కి చెందిన మొక్క. ఈ మొక్క ఆకులు పొగాకు గాను, నశ్యం గాను, పాన్ లలో వాడే గుట్కా గానూ ప్రధానం గా ఉపయోగిస్తారు. పోర్చుగల్ కు ఫ్రెంచ్ రాయబారి జేమ్స్ నికోట్ట్ గౌరవార్ధం ఈ టొబాకో మొక్క జాతికి నికోటియానా అని పేరు పెట్టడం జరిగింది. టొబాకో ను చైనా, కుబా , అమెరికా దేశాలల్లో వాణిజ్య పంట గా పెంచుతున్నారు.
ఆంగ్లేయ వలసదారులు అమెరికా వెళ్లి అక్కడనుంచి యూరప్ దేశాలకు టొబాకో ను తెచ్చి దాని వాడకాన్ని ఎక్కువ చేశారు. తరువాత తాము పాలిస్తూన్న కొన్ని వలస దేశాలల్లో ( అందులో భారత దేశం ఒకటి ) పొగాకు పంట ను విస్తారం చేశారు తమ వ్యాపార ప్రయోజనాల కోసం.
దీని వ్య సన గుణం వల్ల టొబాకో వాడకం చేస్తున్న వారు క్రమంగా బానిసలవుతారు. టొబాకో వాడకపోతే ఉండలేము అన్న స్థితి కి వస్తారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ మంది అంటే రమారమి ప్రపంచ జనాభాలో మూడో వంతు టొబాకో వాడుతున్నారు.
టొబాకో వల్ల ప్రతి సంవత్సరమూ యాభయి నాలుగు లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ( అవును. ఆశ్చర్యంగా ఉంది కదూ ! నిజమే ! అచ్చు తప్పులు ఏవీ లేవు. అక్షరాలా యాభై నాలుగు లక్షలమంది ). ఇవన్నీ నివారించాదగ్గ మరణాలు గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
టొబాకో వాడకం పాశ్చాత్య దేశాలల్లో తగ్గు ముఖం పడుతూండగా , అభివృద్ధి చెందుతూన్న దేశాలల్లో దాని వాడకం ఎక్కువ అవుతూ పోతూంది. అందులోనూ పేద ప్రజలే ఎక్కువ గా పొగాకు వాడుతూ అనేక విధాలుగా నష్ట పోతున్నారు ప్రపంచ వ్యాప్తంగా.
టొబాకో లో ప్రధానంగా ఉండే నికోటిన్ చాలా మొక్కలల్లో ఉండే పదార్ధము. అది నాడీ మండలం పైన పని చేసే విష పదార్ధము. మొక్కలల్లో ఈ నికోటిన్, కీటకాల పైన అత్యంత ప్రభావం చూపే విషపదార్ధము.
పొగాకు లో ఉండే అనేక విష పదార్ధాలు మన దేహం ఫై ఏ విధంగా దుష్ప్రభావం చూపిస్తాయో వచ్చే టపా లో చదవండి.